India Gas Crisis: దేశంలోని వివిధ ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా విషయంలో భయాందోళనలు చెలరేగాయి. హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే దశలో ఉన్నాయి. గ్యాస్ ఏజెన్సీల వెలుపల ప్రజల పొడవైన క్యూలు మొదటగా కనిపించేది ఢిల్లీలోనే. గ్యాస్ సిలిండర్ సంక్షోభం చాలా తీవ్రంగా మారిందని చెబుతున్నారు.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఇప్పుడు మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో హోటల్స్ నడపడంపై తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు మంగళవారం సమావేశమై చర్చించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని హోటల్స్, రెస్టారెంట్‌లకు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోయిందని హోటల్స్ అసోసియేషన్స్ తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్‌లో చాలా హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేసినట్లు తెలిపింది.
అలాగే వాణిజ్య గ్యాస్ సరఫరా కొరతను ఎదుర్కొనే తదుపరి నగరం ముంబై. చాలా హోటళ్ళు స్టాక్ అయిపోయాయని చెబుతున్నాయి. గ్యాస్ కొరత అనేక ప్రధాన రంగాలకు తీవ్రమైన సంక్షోభాన్ని సృష్టించిందని, అవి మూసివేత అంచున ఉన్నాయని నివేదిస్తున్నారు. ఇంకా, భోపాల్ కూడా గ్యాస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రెస్టారెంట్ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గ్యాస్ కొరత సమస్య: ఇక్కడ గ్యాస్ ఏజెన్సీల వెలుపల కూడా భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. లక్నోలో దాదాపు వారం రోజులుగా గ్యాస్ సిలిండర్లు నివాసితులకు చేరలేదని చెబుతున్నారు. గ్యాస్ కొరత కారణంగా అనేక హోటళ్లను మూసివేయాల్సి వచ్చిందని హోటల్ యజమానులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గ్యాస్ కొరత వల్ల టిఫిన్స్ చేయడం మానేసినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా 1943 నుండి పనిచేస్తున్న బెంగళూరులోని ప్రతిష్టాత్మక రెస్టారెంట్ అయిన విద్యార్థి భవన్ మూసివేత అంచున ఉంది.
గ్యాస్ కొరత నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా ఇచ్చారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ సంక్షోభం సామాన్యులపై ప్రభావం చూపకుండా చూసుకోవాలని ఆయన వారిని కోరారు. ఈ దిశగా మంత్రిత్వ శాఖలు, విభాగాలు కలిసి పనిచేయాలని సూచించారు. దేశంలో గ్యాస్ కొరత లేకుండా అందరికి అందేలా చర్యలు చేపడుతున్నామని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కేంద్రం చెబుతోంది.






