కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో అటవీ శాఖ అధికారులతో పాటుగా దేవస్థానం అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. భక్తులకు కీలక సూచనలు చేశారు. మెట్ల మార్గంలో, ఘాట్ రోడ్డులో ఒంటరిగా తిరగవద్దని.. వాహనాలను ఘాట్ రోడ్డులో నిలపవద్దని కోరారు. కొండపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని మైక్ ద్వారా జాగ్రత్తలు చెప్పారు. మరోవైపు పులిని సురక్షితంగా బంధించి అటవీ ప్రాంతంలో వదిలేసేందుకు హనుమాన్ బృందాలను రంగంలోకి దింపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

మరోవైపు ప్రత్తిపాడు నియోజకవర్గంలో గత కొన్నిరోజులుగా పులి తిరుగుతోంది. ఈ క్రమంలోనే శంఖవరం-కత్తిపూడి దాటి మండపం వైపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. అన్నవరం క్షేత్రం పంపా రిజర్వాయర్ మార్గంలోకి పులి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. దీంతో పరిసర గ్రామాలైన తాళ్లపాలెం, అన్నవరం, బెండపూడి, మండపం ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పులి బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
పెద్ద పులి సంచారం.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
మరోవైపు కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారంపై అధికారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జనావాసాల మధ్య సంచరిస్తూ పెద్ద పులి ప్రజలను భయభ్రాంతులకి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ పులిని ఫిబ్రవరి నెలలో కూర్మాపురం వద్ద బంధించిన అటవీ శాఖ అధికారులు.. నిపుణుల సూచన మేరకు పులి మెడలో రేడియో కాలర్ వేసి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే ఆ పులి ఇప్పుడు మళ్లీ జనావాసాల వైపుగా అడుగులు వేస్తున్నట్లు రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ‘హనుమాన్’ బృందాలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేసి దాన్ని సురక్షితంగా బంధించి విశాఖ జూ పార్క్ లో వదలాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఇందుకోసం రాజమండ్రి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో పది హనుమాన్ బృందాలను నియమించారు. పులి మెడలోని రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టం సందేశాల సహాయంతో పులి మళ్లీ జనావాసాల్లోకి రాకముందే.. సురక్షితంగా బంధించాలని ఆదేశించారు. పులి కదలికలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టం, జంతు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, హనుమాన్ బృందాలు సమర్ధవంతంగా పని చేస్తున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజలు సంయమనంతో వ్యవహరిస్తూ అటవీ శాఖ సిబ్బందికి సహకరించాలని కోరారు.


