ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ మీద కర్ణాటక కండక్టర్ దాడి చేసిన ఘటన నంద్యాల జిల్లాలోని శ్రీశైల శిఖరం చెక్‌పోస్టు వద్ద చోటుచేసుకుంది. కర్ణాటక బస్సును అడ్డదిడ్డంగా నడపటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఏపీ ఆర్టీసీ డ్రైవర్, కర్ణాటక డ్రైవర్‌ను బస్సు సరిగా నడపలేవా అని ప్రశ్నించారు. దీంతో మాటామాటా పెరిగి పీలేరు ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాంద్ భాషాపై.. కర్ణాటక బస్సు కండక్టర్, ప్రయాణికులు దాడి చేశారు. బస్సులోకి బలవంతంగా ఎక్కించి, కొట్టుకుంటూ వెళ్లి డోర్నాల వద్ద వదిలేశారు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పీలేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కర్ణాటక బస్సు లు రెండు శ్రీశైలం శిఖరం చెక్‌పోస్టు రహదారిలో ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలోనే కర్ణాటక బస్సు డ్రైవర్ క్యూ ప్రకారం కాకుండా.. బస్సును ఇష్టానుసారం నడపటంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలకు ఆంటకం కలిగింది. దీంతో పీలేరు డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ చాంద్ భాషా.. బస్సును సరిగ్గా నడపాలని, అడ్డదిడ్డంగా ఎందుకు నడుపుతున్నారని కర్ణాటక బస్సు డ్రైవర్‌ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి , తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వీరి మధ్యలో జోక్యం చేసుకున్న కర్ణాటక బస్సు కండక్టర్ , బస్సులోని కొందరు ప్రయాణికులు..ఏపీ ఆర్టీసీ డ్రైవర్ మీద దాడి చేశారు.
పీలేరు ఆర్టీసీ బస్ డ్రైవర్ చాంద్ భాషాను బలవంతంగా బస్సులోకి ఎక్కించి అతనిపై దాడి చేశారు. అనంతరం డోర్నాల వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటనతో నిర్హాంతపోయిన డ్రైవర్ చాంద్ భాషా.. వెంటనే డోర్నాల పోలీస్ స్టేషన్ చేరుకుని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాంద్ భాషా ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కర్ణాటక బస్సు కండక్టర్, ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరోవైపు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం వస్తుంటారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల నేపథ్యంలో రద్దీ మరింత పెరిగింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, కాలినడకన భక్తులు అనేక మంది శ్రీశైలం చేరుకుని మల్లన్నను దర్శించుకుంటున్నారు. అయితే ఇరు రాష్ట్రాల ఉద్యోగుల మధ్య సహృద్భావ వాతావరణం ఉండాల్సిన సమయంలో.. ఇలా గొడవలు పడటం ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


