టీటీడీకి మరో భారీ విరాళం అందింది. చెన్నైకు చెందిన ఓ సంస్థ కోటి రూపాయలు విరాళంగా అదించింది. సుబ్బరావు అపారల్స్ అనే సంస్థ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించింది. విరాళానికి సంబంధించిన చెక్కును టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి చేతికి దాత రాజా రమేష్ ఆదివారం అందించారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి అభినందించారు

తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమలలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 01 తేదీ వరకు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి సందర్భంగా సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే మార్చి 30వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మార్చి 30వ తేదీ ఉదయం ఆరున్నర గంటలకు స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. ఆ తర్వాత వసంతోత్సవ మండపానికి వేంచేస్తారు. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తైన తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
మార్చి 31వ తేదీ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి స్వామివారు మాడ వీధులలో ఊరేగుతారు. ఆ తర్వాత వసంత మండపంలో వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజైన ఏప్రిల్ ఒకటో తేదీ మలయప్పస్వామితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవంలో పాల్గొంటారు.
వసంతోత్సవాల నేపథ్యంలో ఈ మూడు రోజులు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం నిర్వహిస్తారు. వసంతోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. మార్చి 31న అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.


