International
oi-Bomma Shivakumar
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత వేగంగా మారుతున్నాయి. ఓ వైపు చర్చలు అంటూనే ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై దాడులకు పాల్పడుతోంది అమెరికా. ఇరాన్ సైతం ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్- అమెరికా మధ్య చర్చలను సక్సెస్ చేసేందుకు పాకిస్థాన్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అమెరికాకు చెందిన డిమాండ్స్, ప్రొపోసల్ ను ఇరాన్ కు పాకిస్థాన్ చేరవేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరా ధృవీకరించింది. అయితే ఇరాన్ నుంచి ఈ సంధి చర్చలపై ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి.
అయితే ఇరాన్ మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంధి చర్చలను తిప్పి కొడుతోంది. యుద్ధం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. దాంతో ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఇటీవల ట్రంప్ కీలక పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. ఇరాన్ పై దాడులను ఐదు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. కానీ ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ వెంటనే ఖండించింది. దాడులు కొనసాగుతాయని పేర్కొంది.
ఇదిలాఉంటే పశ్చిమాసియా యుద్దంలోకి పాకిస్థాన్ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరాన్- అమెరికా మధ్య సంధి కుదుర్చేందుకు లీడ్ మీడియేటర్ గా పాకిస్థాన్ మారడం ఇప్పుడు భారత్ కు ఆందోళన కలిగించే అంశంగా భావించవచ్చు. ఓవైపు పాకిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆఫ్గానిస్తాన్ తో యుద్ధం, సరిహద్దు దేశాలతో విభేదాలు ఉన్నాయి. ఇంకా రాజకీయ, ఆర్థిక సంక్షోభం పాకిస్థాన్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్- అమెరికా మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు పాకిస్థాన్ ముందుకు రావడం గమనార్హం.
చర్చల్లో భాగంగానే ఇప్పటికే పాకిస్థాన్ డిఫెన్స్ చీఫ్ అసిమ్ మునీర్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ కథనం వెల్లడించింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సైతం ట్రంప్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ పై ట్రంప్ ఐదు రోజులు బ్రేక్ ఇచ్చినట్లు స్పష్టం అవుతోంది. అయితే తాజా పరిణామాల మధ్య ప్రధాని మోదీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. గ్లోబర్ లీడర్, విశ్వగురు అయిన ప్రధాని మోదీపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
ప్రధాని మోదీ నాయకత్వంలోని భారత విదేశాంగ విధానం ఓ జోక్ అని ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇది పర్సనల్ విదేశాంగ పాలనీ అని ఎద్దేవా చేశారు. దీని ఫలితం మీరు త్వరలోనే చూడబోతున్నారంటూ కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాకిస్థాన్.. ఈ యుద్ధాన్ని సద్దుమణిగించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ప్రధాని మోదీ మాత్రం తన అధికార నివాసంలో సేద తీరుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాజాగా ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులు, హార్మూజ్ జలసంధి అంశంపై ఇరు దేశాధినేతలు చర్చించుకున్నారు. హార్మూజ్ జలసంధి తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయానికి వచ్చారు. ప్రధాని మోదీ- ట్రంప్ మాట్లాడుకున్న విషయాలను భారత్ లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ సామాజిక మాధ్యమమైన ఎక్స్ వేదికగా తెలిపారు.

