అన్నార్థుల ఆకలి తీరుస్తూ.. మానవ సేవే మాధవ సేవగా భావిస్తున్న ఓ మహిళను టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి సత్కరించారు. ఆమె ఇంటికి వెళ్లిన సోమిరెడ్డి.. శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు. ఈ వివరాలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అల్లీపురం కుసుమాంబ.. నిత్యం 20 మంది ఆకలి తీరుస్తున్నారని ప్రశంసించిన సోమిరెడ్డి.. మరో డొక్కా సీతమ్మగా అభివర్ణించారు. గిరిజనుల కోసం ఆమె చేస్తున్న సేవను అభినందించారు.

” మా స్వగ్రామం అల్లీపురంలో మెయిన్ రోడ్డు పక్కనే ఒకప్పుడు మాకు ఓ మామిడితోట ఉండేది. ఇప్పుడు ఆ తోట బ్రాహ్మణవీధిగా మారింది. ఆ వీధిలో మాకు అత్యంత ఆత్మీయులైన రఘురామయ్య, కుసుమాంబ దంపతుల కుటుంబం ఉంది. వారి గురించి నాకు ఓ అద్భుతమైన విషయం తెలిసి స్వయంగా ఇంటికి వెళ్లి సత్కరించి వచ్చాను. కుసుమాంబ నిజంగా ఆకలి తీర్చే అన్నపూర్ణమ్మే..మరో డొక్కా సీతమ్మే.. రఘురామయ్య 50 ఏళ్ల క్రితం మా శ్రీనివాసమహల్లో ఉద్యోగి. ఆ తర్వాత వైద్యశాఖలో ఉద్యోగం పొందారు. కుసుమాంబను వివాహమాడారు. వీరికి ముగ్గురు పిల్లలు. అందరూ మంచిగా స్థిరపడ్డారు. రఘురామయ్య కూడా రిటైర్ అయ్యారు.”
” కుసుమాంబ అందరిలా తన బిడ్డలు, మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా ఉండటం వరకే పరిమితం కాలేదు..ఆకలితో వచ్చిన వారి కడుపునింపి అమ్మగా నిలుస్తున్నారు. ఆమె ఇంటికి ఏ సమయంలో ఎవరు వచ్చి అమ్మా ఆకలిగా ఉందంటే.. అప్పటికప్పుడు వండి అయినా వడ్డిస్తారు. ఎవరు ఎప్పుడు వచ్చినా.. అన్నం లేదు అనే మాట ఆమె నోటివెంట రాదు. నిత్యం 20 మందికి పైగా ఆకలి తీరుస్తారు. వీరిలో ఎక్కువ మంది గిరిజనులే. కేవలం అన్నం పెట్టడమే కాదు. వేసవిలో పాదరక్షలు, వర్షాకాలంలో పేదలకు గొడుగులు అందిస్తారు. అలాగే అనారోగ్యంతో వచ్చిన వారికి రఘురామయ్య ఉచితంగా మందులు అందిస్తారు. ” అంటూ సోమిరెడ్డి వీరి వివరాలు పంచుకున్నారు.
వీరి సేవా దృక్ఫథం గురించి తెలియగానే గ్రామస్తులతో కలిసి రఘురామయ్య నివాసానికి వెళ్లానన్న సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి.. కుసుమాంబకు చిరుసత్కారం చేసినట్లు తెలిపారు. ఆమె చేసే సేవ ముందు తమ సత్కారం చాలా చిన్నదని.. అన్నార్తుల ఆకలి తీరుస్తున్న కుసుమాంబ – రఘురామయ్య దంపతులకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని సోమిరెడ్డి కోరుకున్నారు. ఈ నేపథ్యంలో కుసుమాంబను ప్రశంసిస్తూ సోమిరెడ్డి ట్వీట్‌కు నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. ఆకలితో వచ్చే వారి కడుపు నింపటం కంటే గొప్ప సేవ లేదని అభినందిస్తున్నారు.


