AP Government GO On House Plots For Poor People 3 Cents In Rural And 2 Cents In Urban Areas: ఇళ్ల స్థలాల పంపిణీపై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీచేసింది. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున పేదలకు ఉచితంగా ఇళ్ల స్థలం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అందరికీ ఇళ్లు పథకం పేరుతో ఏపీ సర్కారు జీవో జారీ చేసింది. ఈ పథకానికి ఎవరు అర్హులనే వివరాలతో ఈ జీవో విడుదల చేశారు. ఈ మేరకు ఏపీ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో అర్హతలు, నిబంధనలు వెల్లడించారు.

ఈ జీవో ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాన్ని మహిళల పేరుతో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అలాగే ఏజెన్సీల ద్వారా ఈ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక ఇంటి పట్టా ఇచ్చిన రెండేళ్లలో అక్కడ ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి మాత్రమే ఇంటి స్థలం కేటాయిస్తారు. ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ ఇవ్వనుంది. ఇంటి స్థలం పట్టా పొందిన వారికి పదేళ్ల తరువాతనే ఆ స్థలంపై పూర్తి హక్కులు లభిస్తాయి. ఆ మేరకు పదేళ్ల కాలపరిమితితో ఫ్రీహోల్డ్ హక్కులు ఇచ్చేలా కన్వేయన్స్ డీడ్ జారీచేస్తారు.
మరోవైపు ఒక్కసారి మాత్రమే ప్రభుత్వం నుంచి ఉచిత ఇంటి స్థలం పొందేలా అందరికీ ఇళ్లు పథకంలో విధి విధానాలు రూపొందించారు. అలాగే ఈ పథకం కింద లబ్ధిపొందే వారికి రాష్ట్రంలో ఎక్కడా ఇంటిస్థలం ఉండకూడదు. అలాగే సొంత ఇల్లు కూడా ఉండకూడదని ప్రభుత్వం షరతులు, నిబంధనలు విధించింది. అలాగే గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర గృహనిర్మాణ పథకాల్లోనూ లబ్ధిదారుగా ఉండకూడదని జీవోలో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలాగే ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత ఇళ్ల స్థలాన్ని ఆధార్, రేషన్ కార్డులకు అనుసంధానం చేయనున్నారు. మరోవైపు ఇంటి పట్టాల పంపిణీ కోసం ఉన్న భూమినే వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. కొత్తగా భూములను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్న భూమిలోనే అర్హులకు పట్టాలు పంపిణీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.


