Ganta Srinivasa rao Shared his Flight Journey Experiance: మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు మంగళవారం వింత అనుభవం ఎదురైంది. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలుద్దామని విజయవాడ బయల్దేరిన ఆయనకు అనూహ్యమైన అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వివరాలను గంటా శ్రీనివాసరావు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తన ట్వీట్‌కు చంద్రబాబు. నారా లోకేష్, కింజరాపు రామ్మోహన్ నాయుడులను కూడా ట్యాగ్ చేశారు. ఇదేం దుస్థితి అంటూ గంటా తనకు ఎదురైన ఇబ్బందిని వివరించారు.

“ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడి నుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖ – విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి.” అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.
మరోవైపు విశాఖపట్నం విజయవాడ మధ్య 2024 అక్టోబర్‌లో రెండు విమాన సర్వీసులను ప్రారంభించారు. విశాఖ నుంచి విజయవాడ వెళ్లేందుకు రోజూ ఉదయం రెండు సర్వీసులు.. సాయంత్రం ఒక విమాన సర్వీసు అందుబాటులో ఉండేది. అయితే తాజాగా ఉదయం ఉన్న విశాఖ విజయవాడ విమాన సర్వీసులను రద్దు చేసారు. దీంతో ఉదయాన్నే విశాఖ నుంచి విజయవాడ రావాల్సిన వారు వందే భారత్ రైలును ఆశ్రయిస్తున్నారు. అయితే మంగళవారం ఉదయం విశాఖ విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులో లేకపోవటంతో మరింత ఇబ్బంది ఎదురవుతోంది.
మరోవైపు విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కీలక సర్వీసులు నిలిచిపోనున్నాయి. దీంతో విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ – బ్యాంకాక్, విశాఖ – కౌలాలంపూర్ సర్వీసులను మేలో రద్దు చేయనున్నారు. బ్యాంకాక్, కౌలాలంపూర్ సర్వీసులను 2024 ఏప్రిల్‌లో ప్రారంభించారు. అయితే ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో.. మే మొదటి వారం నుంచి ఈ సర్వీసులు రద్దు చేయనున్నారు. ఇప్పటికే టికెట్ల బుకింగ్ నిలిపివేశారు.