ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న నిజరూప దర్శనానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన నిజరూప దర్శనం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నిజరూప దర్శనం, చందనోత్సవం నేపథ్యంలో భక్తులు భారీగా తరలిరానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అప్పన్న నిజరూప దర్శనం టికెట్లను రేపు విడుదల చేయనున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో భక్తుల కోసం నిజరూప దర్శనం టికెట్లను అందుబాటులో ఉంచారు.

సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. అప్పన్నస్వామి నిజరూప దర్శనానికి టికెట్ల విక్రయాలను రేపటి నుంచి (ఏప్రిల్ 24) సింహాచలం దేవస్థానం ప్రారంభించనుంది. అప్పన్న నిజరూప దర్శనం టికెట్ల విక్రయాలు గురువారం నుంచి ప్రారంభమవుతాయని సింహాచలం దేవస్థానం ఈవో కె. సుబ్బారావు వెల్లడించారు. ఆఫ్లైన్, ఆన్లైన్లలో అప్పన్న నిజరూప దర్శనం టికెట్లు విక్రయిస్తున్నట్లు తెలిపారు. దేవస్థానం నిర్దేశిత ప్రాంతాలలో ఆఫ్ లైన్ టికెట్ల విక్రయాలు ఉంటాయన్న దేవస్థానం ఈవో.. ఆన్లైన్లో ఏప్రిల్ 29వ తేదీ వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. రూ.300, రూ.1000లకు అప్పన్న నిజరూప దర్శనం టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. 29వ తేదీ తర్వాత టికెట్ల విక్రయాలు నిలిపివేస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు చందనోత్సవం రోజు కూడా టికెట్లు విక్రయం ఉండదని సింహాచలం దేవస్థానం స్పష్టం చేసింది. భక్తుల కోసం ఉచిత దర్శనాల క్యూలైన్ ఏర్పాటు చేస్తోంది. ఇక సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం టికెట్లను సింహగిరిపై పాత పీఆర్వో కార్యాలయం వద్ద విక్రయిస్తారు. గురువారం నుంచి ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు టికెట్ల విక్రయాలు జరగనున్నాయి. అలాగే సింహాచలంలోని యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు శాఖల్లోనూ టికెట్లు అందుబాటులో ఉంచారు.
ఉదయం 9గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఈ బ్యాంకులలో నిజరూప దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా అక్కయ్యపాలెం, మహారాణిపేట యూనియన్ బ్యాంకు బ్రాంచులలోనూ, బిర్లా కూడలి, సాలిగ్రామపురంలోని స్టేట్ బ్యాంక్ బ్రాంచ్లలోనూ టికెట్లు అందుబాటులో ఉంటాయి. సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం టికెట్లు ఆన్లైన్లో పొందాలంటే www.aptemples.ap.gov.in వెబ్ సైట్ సంప్రదించాలని ఆలయ అధికారులు సూచించారు.