జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కపడేలా చేసింది. ఈ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. దేశంలో మళ్లీ ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘావర్గాల దేశంలోని అన్ని రాష్ట్రాలకు హెచ్చరికాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలోని పోలీసు శాఖను అప్రమత్తం చేసింది. హైదరాబాద్‌లో ఏప్రిల్ 25, 26 తేదీల్లో భారత్ సమ్మిట్, మే 7 నుంచి మిస్ వరల్డ్-2025 పోటీలు వంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లు నిర్వహించనున్న తరుణంలో పోలీస్ శాఖ సెక్యూరిటీ పెంచింది. నగర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. దీంతో పాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది.
హైదరాబాద్‌లో నిర్వహించబోయే భారత్ సమ్మిట్ లో జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమ్మిట్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ సహా వంద దేశాల నుంచి దాదాపు 400 మంది హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ఇక్కడ నిర్వహించబోయే మిస్ వరల్డ్ పోటీలకు దాదాపు 140 దేశాల నుంచి కంటెస్టెంట్స్ హజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ కార్యక్రమాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ముందస్తు కార్యాచరణ రూపొందించుకొని..హెచ్ఐసీసీ, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
మరోవైపు ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ జితేందర్ రాష్ట్ర పోలీసు అధికారులకు కీలక సూచనలు చేశారు.
నగరంలో ఇప్పటికే ఉగ్రవాద దాడులు జరిగిన ప్రాంతాల సహా జనాల రద్దీ ఎక్కువగా ఉండే, పర్యాటక ప్రాంతాల్లో సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు గురువారం రాత్రి నుంచి రంగంలోకి దిగనున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిసర ప్రాంతాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకోనున్నారు. హైటెక్ సిటీ సహా విదేశీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…