ఐపీఎల్ 2025లో జరిగిన 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో, సోషల్ మీడియా ఫ్యాన్స్ మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేస్తుండగా, స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్, దీపక్ చాహర్ వేసిన మూడవ ఓవర్ తొలి బంతిని లెగ్ సైడ్ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌ను తాకకుండా నేరుగా వికెట్ కీపర్ రికెల్టన్ చేతికి వెళ్లింది. అంపైర్ ఎలాంటి ఔట్ ఇవ్వకపోయినా, ఇషాన్ మాత్రం తానేం ఔట్ అయ్యానని భావించి తానే మైదానాన్ని వీడుతూ పెవిలియన్ బాట పట్టాడు.
అయితే రీప్లేలో బంతి అతని బ్యాట్‌కు గానీ, శరీరానికి గానీ తగలకపోవడం స్పష్టమైంది. దీంతో అతను క్రీడా స్పూర్తితో పెవిలియన్‌కు వెళ్లినట్లయినా, అంపైర్ ఇన్ ఔట్ స్పష్టత ఇవ్వకముందే మైదానాన్ని వదిలేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది సాధారణమైన అవుట్ కాదు, కాబట్టి ఈ చర్యపై క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. కొన్ని వర్గాల్లో ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కిందకు వస్తుందని ఆరోపణలు వస్తుండగా, ముంబై ఇండియన్స్ నుంచి డబ్బు తీసుకున్నాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు. “ఇలాంటి సమయంలో ఆటగాడు కొంచెం సహనంతో వ్యవహరించాలి. కనీసం అంపైర్ నిర్ణయం వచ్చే వరకు అయినా క్రీజులో ఉండాలి. అంపైర్ కూడా తన పనికి జీతం తీసుకుంటున్నాడు కదా, అతనికి తన పని చేయనివ్వాలి,” అంటూ సెహ్వాగ్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.
ఇషాన్ కిషన్ తాను ఔట్ అయ్యానని అనుకోవడమే తప్పుగా మారిపోయింది. ఆటలో స్పోర్ట్స్మాన్షిప్ ఒక విషయం అయితే, అంపైర్‌ను పక్కన పెట్టి తానే నిర్ణయం తీసుకోవడం మరో విషయం. ఇది కేవలం ఒక తప్పు నిర్ణయం అని కొంతమంది భావించగా, మరికొందరైతే దీని వెనుక ఇంకేమైనా ఉందేమో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు బీసీసీఐ, మ్యాచ్ రిఫరీలు దీనిపై స్పందిస్తారా? ఇషాన్‌కు దండన విధించబడుతుందా? అన్నది ఆసక్తికరమైన విషయంగా మారింది.
మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ గెలిచి MI బౌలింగ్ ఎంచుకున్నప్పటి నుండి, ముంబై మొదటి ఓవర్ నుంచే దూకుడుగా ఆడి విజయం సాధించింది. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4 ఓవర్లలో 4/26తో అద్భుత ప్రదర్శన చేశాడు. దీపక్ 2/12, పాండ్యా, బుమ్రా చెరో వికెట్ తీసారు. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ – విల్ జాక్స్ (19 బంతుల్లో 22), రోహిత్ – సూర్యకుమార్ మధ్య భాగస్వామ్యాలు విజయానికి బలంగా నిలిచాయి. ఈ విజయంతో ముంబై ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు SRH జట్టు రెండు విజయాలతో, ఆరు ఓటములతో తొమ్మిదో స్థానంలో పడిపోయింది.
SRH జట్టు తొలుత సీజన్లో దూసుకెళ్లినట్టు కనిపించినా, ప్రస్తుతం వారి ఆట తీరులో స్థిరత్వం కనిపించడం లేదు. పాట్ కమిన్స్ తన నాయకత్వంలో జట్టును ముందుకు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు.