International
oi-Chandrasekhar Rao
ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4 గా రికార్డయింది. దీని ప్రభావంతో సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. భూకంప తీవ్రత ధాటికి తీర ప్రాంతం మొత్తం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగిసిపడ్డాయి. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. 30 సెంటీ మీటర్ల ఎత్తువరకు అలలను ఎగిసిపడ్డాయి. కొన్ని చోట్ల భవనాలు నేలకూలాయి. శిథిలాల మధ్య చిక్కుకుని ఒకరు మరణించినట్లు ఇండోనేషియా బ్రాడ్‌కాస్టర్ మెట్రో టీవీ వెల్లడించింది.
ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని సులావేసి- మలుకు దీవుల మధ్య గల మొలుకా సముద్రంలో 35 కిలో మీటర్ల లోతు భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. ఈ తెల్లవారుజామున భూమి ప్రకోపించింది. భూకంప కేంద్రం నుంచి 1,000 కిలో మీటర్ల పరిధిలో గల ప్రాంతాలు, ఇతర దేశాలపై దీని ప్రభావం పడుతుందని హవాయ్ లోని సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది.

దీనికి అనుగుణంగా సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఇండోనేషియాలోని ద్వీప సముదాయాలు, ఫిలిప్పీన్స్, మలేషియా తీరాలకు ప్రమాదకర సునామీ అలలు రావచ్చని పేర్కొంది. ఇండోనేషియా బీఎంకేజీ భూగర్భ ప్రయోగాల సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. భూకంపం సంభవించిన తర్వాత సరిగ్గా 30 నిమిషాల్లో టెర్నాటే ఉత్తర భాగంలోని నార్త్ మలుకు ప్రావిన్స్‌లో 30 సెంటీ మీటర్ల ఎత్తు వరకు అలలు నమోదయ్యాయి. సులావేసి ఈశాన్య ప్రాంతం బిటుంగ్ తీరంలో 20 సెంటీ మీటర్ల మేర అలలు కనిపించాయి.
తమ దేశానికి సునామీ ముప్పు ప్రస్తుతానికి లేదని మలేషియా వాతావరణ విభాగం తెలిపింది. భూకంప పర్యవసానాలను పర్యవేక్షిస్తున్నట్లు వివరించింది. ఇండోనేషియా బ్రాడ్‌కాస్టర్ మెట్రో టీవీ ప్రకారం- మనాడోలో శిథిలాల కింద చిక్కుకుని ఒకరు మరణించారు. అక్కడ దెబ్బతిన్న భవనాలకు సంబంధించిన వీడియోలను కూడా ఈ బ్రాడ్ కాస్టర్ టెలికాస్ట్ చేసింది. సముద్ర మార్గంలో టెర్నాటేకు పశ్చిమాన 300 కిలో మీటర్ల దూరంలో ఉన్న మాండౌలో భూకంప తీవ్రత కనిపించింది. 4,50,000 జనాభా ఉన్న నగరం ఇది
భూమి కంపించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. రోడ్లపైకి పరుగులు పెట్టారు. ప్రధాన భూకంపం తరువాత కూడా ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండే దేశాల్లో ఇదీ ఒకటి. బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా, పాపువ న్యూగినియా, న్యూజిలాండ్, అంటార్కిటికా- ఈ రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉన్నాయి.

