జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖపట్నం నైట్ ఫుడ్ కోర్టు తొలగింపును నిరసిస్తూ గత కొంతకాలంగా నిరసనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ అంశంపై ఎమ్మెల్యే వంశీకృష్ణకు సీఐటీయూ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యే.. వెనువెంటనే వారికే ఇచ్చేయటం, ఈ సమయంలో ఆయన వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.

మరోవైపు వినతిపత్రాన్ని వెనక్కి ఇచ్చేసి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే వంశీకృష్ణ.. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి వారితో ఏదో మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా కాస్త ఓపికతో వ్యవహరించాలని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సమస్యను విన్న తర్వాత వినతిపత్రాన్ని తన వ్యక్తిగత సిబ్బందికి అందించాల్సింది పోయి బాధితులకే విసిరికొడతారా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు విశాఖపట్నం జైలు రోడ్డులో ఉన్న ఫుడ్ కోర్టును గతేడాది సెప్టెంబర్ నెలలో అధికారులు తొలగించారు. జేసీబీల సాయంతో దుకాణాలను తొలగించారు. వాస్తవానికి 2019లో 32 దుకాణాలకు వ్యాపారాలు చేసుకునేందుకు అప్పటి అధికారులు అనుమతి ఇచ్చారు. నైట్ ఫుడ్ స్ట్రీట్లలో వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. కరోనా సమయంలో నైట్ ఫుడ్ కోర్టు మూతపడింది. 2021 చివరిలో తిరిగి ప్రారంభించారు. అయితే నైట్ ఫుడ్ కోర్టును కొంతమంది తమ చేతులలోకి తీసుకుని.. అక్రమంగా దందాలు చేస్తున్నారని జీవీఎంసీ దీనిని తొలగించాలని నిర్ణయించింది. ఫుడ్ కోర్టు తొలగించి అర్హులైన వారికే వ్యాపారానికి స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గతేడాది సెప్టెంబర్ నెలలో నైట్ ఫుడ్ కోర్టు తొలగించారు.
అయితే నైట్ ఫుడ్ కోర్టును తొలగించారే కానీ.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నైట్ ఫుడ్ కోర్టు తొలగింపును నిరసిస్తూ గతంలో సమ్మె కూడా చేపట్టారు. గత కొన్ని రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఫుడ్ కోర్టు లేక, వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ క్రమంలోనే వారికి సంఘీభావంగా తెలిపిన సీఐటీయూ నేతలు.. ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించేందుకు వస్తే ఈ ఘటన చోటుచేసుకుంది.


