మంగ్లీపై మైక్రో ఫైనాన్స్ వివాదం: ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య ముదురుతున్న కేసు
తెలుగు రాష్ట్రాల్లో ఫోక్, సినిమా పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ ఇప్పుడు ఒక భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన చీటింగ్ కేసు నేపథ్యంలో ఈ వ్యవహారం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు, కౌంటర్ ఆరోపణల మధ్య ఈ కేసు హైప్రొఫైల్‌గా మారింది.
కేసు ఎలా ప్రారంభమైంది?
ఇవి కూడా చదవండి
అడ్వకేట్ సింగపోగు సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, మంగ్లీతో పాటు ఆమె సోదరుడు శివపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వాదన ప్రకారం, రమావత్ మధు అనే వ్యక్తి మంగ్లీ పేరును ఉపయోగించి “గోకుల్ నందన ఇన్‌ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్” పేరిట మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలు నిర్వహించాడు. పెట్టుబడులకు నెలకు 4–5 శాతం వడ్డీ, స్థలాల రిజిస్ట్రేషన్ వంటి హామీలతో ప్రజల నుంచి సుమారు రూ.150 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఆరోపించారు. ఈ వ్యవహారంలో తానే వ్యక్తిగతంగా దాదాపు రూ.10 కోట్ల వరకు మోసపోయానని సుబ్బారావు పేర్కొన్నారు. డబ్బులు తిరిగి అడిగితే బెదిరింపులు వచ్చాయని కూడా ఫిర్యాదులో తెలిపారు.
మంగ్లీ కౌంటర్ కంప్లైంట్
తనపై వచ్చిన ఆరోపణలను మంగ్లీ ఖండించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కావాలనే తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, నార్సింగి పోలీస్ స్టేషన్‌లో అడ్వకేట్ సుబ్బారావుపై కౌంటర్ కంప్లైంట్ ఇచ్చారు. అడ్వకేట్ తనను పదేపదే కలవాలని ఒత్తిడి తెచ్చి, మానసికంగా వేధించాడని మంగ్లీ ఆరోపించారు. తనకు సంబంధం లేని ఆర్థిక లావాదేవీల్లో తన పేరును లాగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా, మీడియాలో నెగెటివ్ ప్రచారం పెరుగుతుండటంతో ఆమె నేరుగా డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు.
స్కామ్ వెనుక గ్యాంగ్ ఎవరు?
ఈ కేసులో కీలక నిందితులుగా రమావత్ మధు, బాలాజీనాయక్, భరత్ చౌహాన్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిపై నల్గొండ, గద్వాల్ జిల్లాల్లో మొత్తం 62 కేసులు నమోదయ్యాయి. పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైనట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులను సీఐడీకి బదిలీ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
రమావత్ మధు వీడియోతో కొత్త మలుపు
పరారీలో ఉన్న రమావత్ మధు తాజాగా వీడియో విడుదల చేయడం కేసులో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చింది. ఆ వీడియోలో అడ్వకేట్ సుబ్బారావు చెప్పిన ఆరోపణలు వాస్తవాలు కావని, తాను కూడా మోసపోయానని పేర్కొన్నాడు. హిమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి కంపెనీ డబ్బులను తన దగ్గరే ఉంచుకున్నాడని ఆరోపించాడు. అంతేకాకుండా, ఆ డబ్బులు బినామీల వద్ద ఉన్నాయని, వాటిని తిరిగి తీసుకుని బాధితులకు ఇవ్వాలని కోరాడు. అడ్వకేట్ తన దగ్గర డబ్బులు డిమాండ్ చేశాడని, సెలబ్రిటీల ఫొటోలు, ఫోన్ నంబర్లు సేకరించి వేరే రీతిలో డబ్బులు వసూలు చేయాలనుకున్నాడని కూడా ఆరోపించాడు.
హిమాకాంత్ రెడ్డి పాత్రపై అనుమానాలు
మధు వీడియో తర్వాత హిమాకాంత్ రెడ్డి పేరు ఈ కేసులో కీలకంగా మారింది. గోకుల్ నందన ఇన్‌ఫ్రా బ్రోచర్ లాంచ్ సమయంలో అతడిని డైరెక్టర్‌గా ఉండాలని ఆహ్వానించగా, అతను తిరస్కరించి ‘బ్యాక్‌బోన్‌గా ఉంటాను’ అని చెప్పినట్టు సమాచారం. ఇది చూస్తే ముందుగానే పరిణామాలను అంచనా వేసి ప్రత్యక్ష పాత్రకు దూరంగా ఉన్నాడా? లేక ఆర్థిక లావాదేవీల్లో కీలక పాత్ర పోషించాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసులో ప్రదాన ప్రశ్నలు ఇవే..
మైక్రో ఫైనాన్స్ లావాదేవీలకు మంగ్లీకి నిజంగా సంబంధం ఉందా?, రమావత్ మధు గ్యాంగ్ ఎంత మేరకు మోసం చేసింది?, హిమాకాంత్ రెడ్డి పాత్ర ఏమిటి?, బాధితులకు డబ్బులు తిరిగి వస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. ఒకవైపు రూ.150 కోట్ల స్కామ్ ఆరోపణలు.. మరోవైపు బ్లాక్‌మెయిల్, దుష్ప్రచారం అంటూ కౌంటర్ ఫిర్యాదులు.. ఈ కేసు పూర్తిగా సంక్లిష్టంగా మారింది. పోలీసులు ఈ హైప్రొఫైల్ కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజం ఏంటి? ఎవరు బాధ్యులు.? అన్నది త్వరలో బయటపడాల్సి ఉంది. అప్పటివరకు ఈ కేసు మరిన్ని ట్విస్టులతో ముందుకు సాగే అవకాశం ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

