India
-Lingareddy Gajjala
బీహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సమ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, ఈసారి ప్రభుత్వం ఏర్పాటులో ఒక వింత చోటుచేసుకుంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత చిన్న మంత్రివర్గాలలో ఒకటిగా ఇది నిలిచింది. ముఖ్యమంత్రితో పాటు కేవలం ఇద్దరు మంత్రులు మాత్రమే ప్రమాణం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జనతాదళ్ (యునైటెడ్) నేతలు విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో శాఖల పంపిణీ ఆసక్తికరంగా మారింది. హోం, సాధారణ పరిపాలన, ఆరోగ్యం, ఆర్థికం, వ్యవసాయం, రహదారుల నిర్మాణం వంటి ఏకంగా 29 కీలక విభాగాలను ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తన వద్దే ఉంచుకున్నారు. ఇది ప్రభుత్వంలో బీజేపీ పట్టును స్పష్టం చేస్తోంది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ చౌదరికి 10 శాఖలు, బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌కు 8 శాఖలు దక్కాయి. గతంలో నితీష్ కుమార్ వద్దే ఉండే అత్యంత కీలకమైన ‘హోం శాఖ’ ఈసారి జేడీ(యు)కి దక్కకపోవడం గమనార్హం.

విస్తరణకు ‘బెంగాల్’ బ్రేక్.. కారణం అదేనా?
ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరకపోవడానికి పొరుగు రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ఎన్నికలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రధాని మోడీ, అమిత్ షా సహా బీజేపీ అగ్రనేతలంతా బెంగాల్ ప్రచారంలో నిమగ్నమై ఉండటంతో మంత్రుల జాబితా ఖరారు కాలేదు. మే 4న బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, మే 5న బీహార్ కేబినెట్ విస్తరణ ఉండవచ్చని సమాచారం.
బీజేపీలో అంతర్గత మథనం.. విజయ్ సిన్హా పాత్ర ఏంటి?
కొత్త మంత్రుల ఎంపికలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. పాతవారికి, కొత్తవారికి మధ్య సమతౌల్యం సాధించే క్రమంలో అధిష్టానం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన సీనియర్ నేత విజయ్ సిన్హా విషయంలో పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఆయనకు కేబినెట్‌లో ప్రాధాన్యత ఇస్తారా లేక పార్టీపరంగా వేరే బాధ్యతలు అప్పగిస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ సమీకరణలు తేలకపోవడం వల్లే మిత్రపక్షాలైన ఎల్‌జేపీ (రామ్ విలాస్), హెచ్‌ఏఎం (HAM) వంటి పార్టీలు కూడా వెయిటింగ్ లిస్టులో ఉండాల్సి వచ్చింది.
అసంతృప్తి సెగలు.. మిత్రపక్షాల వేచిచూపు!
శాఖల కేటాయింపులో బీజేపీ పెత్తనంపై జేడీ(యు) శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కీలకమైన హోం శాఖ తమకు దక్కకపోవడంపై ఆ పార్టీ నేతలు కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో జరిగే విస్తరణలో జేడీ(యు)కి సుమారు 15 మంత్రి పదవులు దక్కవచ్చని అంచనా. అప్పటి వరకు రాష్ట్ర పరిపాలన అంతా ఈ ముగ్గురి భుజస్కంధాల మీదే సాగనుంది.
ముత్తమొత్తంగా, ‘మినీ కేబినెట్’తో ప్రయాణం మొదలుపెట్టిన సమ్రాట్ చౌదరి.. మే 5 తర్వాత తన అసలైన టీమ్‌ను ఎలా సిద్ధం చేస్తారు? మిత్రపక్షాలను ఎలా సర్దుబాటు చేస్తారు? అన్నది ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్.

