Andhra Pradesh
oi-Chandrasekhar Rao
ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత అధికమౌతోంది. ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నడి వేసవి రాకముందే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తోన్నాయి. ప్రజలు రోడ్ల మీదికి రావాలంటే హడలిపోయే పరిస్థితి నెలకొంది. ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మున్ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఉపరితల ఆవర్తనం వల్ల మొన్నటివరకు వర్షాలు పడ్డాయి గానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత దిమ్మతిరిగేలా చేస్తోంది. రికార్డుస్థాయిలో టెంపరేచర్ నమోదవుతోంది. 40 డిగ్రీల ఎండ కాయడం సాధారణమైపోయింది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి. వేడి గాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి.

ఈ రెండు నెలల్లో ఎండ తీవ్రత 43 నుంచి 45 డిగ్రీల వరకు ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ గురువారం నంద్యాల జిల్లా సంజామలలో 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఇదే అత్యధికం. దీని తర్వాత రెండో స్థానంలో కడప జిల్లా ఉంది. జిల్లాలోని ఒంటిమిట్టలో 44.9 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ రికార్డయింది. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 150కి పైగా మండలాల్లో వడగాల్పులు వీచాయి.
నేడు కూడా ఇదే తీవ్రత కొనసాగుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని అంచనా వేసింది. పార్వతీపురం మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో గరిష్ఠంగా 43 నుంచి 44.5 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండ తీవ్రత నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఎండ తీవ్రత నేపథ్యంలో బయటకు వెళ్లేప్పుడు తలకి టోపీ లేదా కర్చీఫ్, తెలుపు రంగు కాటన్ వస్త్రాలు ధరించాలని, ఎండ తీవ్రత కళ్లపై పడకుండా ఉండేలా సన్ గ్లాసెస్ ఉపయోగించాలని సూచించారు. డీహైడ్రేషన్ కు గురి కాకుండా మంచినీరు ఎక్కువగా తాగాలని, గుండె జబ్బులు, బీపీ, షుగర్ ఉన్నవారు ఎండలో తిరగకూడదని అన్నారు.

