IPL 2026 : ఐపీఎల్ 2026లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్‌తో జరగనున్న కీలక పోరుకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో తీవ్ర విషాదం నెలకొంది. ప్రాక్టీస్ సెషన్‌లో ఆ జట్టు యువ ఆటగాడు సాహిల్ పారఖ్ దారుణంగా గాయపడ్డారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మైదానంలోకి అంబులెన్స్‌ను రప్పించి, వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఢిల్లీ ఆటగాళ్లు, అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ప్రాక్టీస్ సెషన్‌లో అసలేం జరిగింది?
నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ జరగాల్సి ఉంది. దీని కోసం శుక్రవారం సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక వేగవంతమైన బంతి సాహిల్ పారఖ్ ముఖానికి (నోటిపై) బలంగా తగిలింది. దెబ్బ తగిలిన వెంటనే సాహిల్ నోటి నుంచి భారీగా రక్తం రావడంతో అతడు కుప్పకూలిపోయాడు.
వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి
మైదానంలో ఉన్న మెడికల్ స్టాఫ్ ప్రాథమిక చికిత్స అందించడానికి ప్రయత్నించినప్పటికీ, రక్తస్రావం ఆగకపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దీంతో వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి సాహిల్ ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సాహిల్ స్ట్రెచర్‌పై పడుకుని తీవ్ర నొప్పితో విలవిలలాడుతుండటం కనిపిస్తోంది. ప్రస్తుతం అతడికి శస్త్రచికిత్స అవసరమని సమాచారం అందుతోంది.
ఎవరీ సాహిల్ పారఖ్?
మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల సాహిల్ పారఖ్‌ను ఈ ఏడాది మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన ఈ కుర్రాడు.. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సాహిల్ మంచి ప్రతిభ కనబరిచాడు. అయితే, అరంగేట్రం చేసే ముందే ఇలాంటి తీవ్రగాయం కావడం అతడి కెరీర్‌కు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు.
A young Delhi Capitals player was hit hard on the face by the ball during practice, which caused a serious injury. An ambulance was called to the ground, and he was placed on a stretcher and taken to the hospital.😢
I hope he’s okay and hasn’t suffered any serious injury.🙏 pic.twitter.com/JX8Xjl6YOW
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 24, 2026
ఢిల్లీ జట్టులో ఆందోళన
ఈ ఘటనపై ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సాహిల్ గాయం ఎంత తీవ్రంగా ఉంది? అతడు ఈ సీజన్ నుంచి తప్పుకుంటాడా? లేదా? అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీకి, ఒక యువ ఆటగాడు ఇలా గాయపడటం మానసికంగా ఒత్తిడి కలిగించే అంశమే. పంజాబ్ లాంటి బలమైన జట్టుతో నేడు తలపడనున్న తరుణంలో ఈ వార్త జట్టులో కలకలం రేపింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

