ఎండలు ముదురుతుండటంతో బయట వేడి తట్టుకోలేక బల్లులు ఇళ్లలోకి క్యూ కడుతున్నాయి. గోడల మూలల్లో, కర్టెన్ల వెనుక, కిటికీల దగ్గర నక్కి ఉండి అకస్మాత్తుగా కనిపిస్తూ మనల్ని భయపెడుతుంటాయి. వీటి వల్ల అసౌకర్యమే కాదు, ఆహారంపై పడితే విషతుల్యమయ్యే ప్రమాదం కూడా ఉంది. మార్కెట్లో దొరికే హానికరమైన రసాయనాలు వాడకుండా, మీ వంటింట్లో ఉండే వస్తువులతోనే బల్లులను శాశ్వతంగా తరిమికొట్టే అద్భుతమైన మార్గాల గురించి తెలుసుకుందాం..
ఘాటైన ఉల్లి, వెల్లుల్లి స్ప్రే
బల్లులకు ఉల్లిపాయ, వెల్లుల్లి నుంచి వచ్చే ఘాటైన వాసన అంటే అస్సలు పడదు. వెల్లుల్లి రెబ్బలను లేదా ఉల్లిపాయ ముక్కలను కిటికీల దగ్గర వేలాడదీయండి. ఇంకా బాగా పనిచేయాలంటే.. వీటి రసాన్ని నీటిలో కలిపి బల్లులు తిరిగే చోట స్ప్రే చేయండి. ఆ వాసనకు అవి దరిదాపుల్లోకి కూడా రావు.
నెమలి ఈకల మ్యాజిక్
ఇదొక పురాతనమైన కానీ అద్భుతమైన చిట్కా. నెమలి ఈకలను చూస్తే ఏదో పెద్ద జంతువు లేదా పాము ఉందనే భయం బల్లులకు కలుగుతుంది. అందుకే పూల కుండీల్లో లేదా గోడల మూలల్లో నెమలి ఈకలను ఉంచితే ఆ భయంతో బల్లులు ఇంటి దరిదాపుల్లోకి రావు.
మిరియాల నీటితో కారపు షాక్
రసాయన మందుల కంటే మిరియాల నీరు చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. నీటిలో మిరియాల పొడి లేదా ఎర్ర మిరప పొడి కలిపి మిశ్రమాన్ని తయారు చేయండి. బల్లులు ఎక్కువగా ఉండే చోట ఈ నీటిని చల్లితే, ఆ ఘాటుకు అవి వెంటనే పారిపోతాయి.
ఐస్ వాటర్ ట్రిక్
బల్లులు శీతల రక్త జంతువులు. వీటిపై ఒక్కసారిగా చాలా చల్లటి నీటిని చల్లితే, వాటి శరీర ఉష్ణోగ్రత పడిపోయి తాత్కాలికంగా పక్షవాతానికి గురవుతాయి. అప్పుడు అవి కదలలేవు కాబట్టి సులభంగా పట్టుకుని బయట పారేయవచ్చు.
కాఫీ, పొగాకు ఉండలు
కాఫీ పొడి, పొగాకు పొడిని కలిపి చిన్న ఉండలుగా చేసి అగ్గిపుల్లల చివరన గుచ్చండి. వీటిని అల్మారాలు లేదా చీకటి మూలల్లో ఉంచితే, ఆ వాసన బల్లులకు విషంలా పనిచేసి వాటిని దూరం చేస్తుంది.
నాఫ్తలీన్ గోళీలు
బట్టల మధ్యలో వేసే నాఫ్తలీన్ గోళీలు బల్లులను తరిమికొట్టడంలో బాగా సహాయపడతాయి. అయితే ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉంటే వీటిని జాగ్రత్తగా, వారికి అందనంత ఎత్తులో ఉంచాలి.
గుడ్డు పెంకుల భయం
గుడ్డు తిన్న తర్వాత పెంకులను పారేయకుండా శుభ్రంగా కడిగి కిటికీల దగ్గర ఉంచండి. ఆ పెంకులను చూసి ఏదో పెద్ద జీవి అక్కడ ఉందని బల్లులు భ్రమపడతాయి. ప్రాణభయంతో అవి మీ ఇంటి వైపు చూడటానికి కూడా సాహసించవు.
పరిశుభ్రతే పరమౌషధం
ఇంట్లో దోమలు, ఈగలు, చిన్న చిన్న కీటకాలు ఉంటేనే వాటిని తినడానికి బల్లులు వస్తాయి. కాబట్టి ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం, గోడల పగుళ్లను మూసివేయడం ముఖ్యం. ఆహారం లేకపోతే బల్లులు తమంతట తామే ఇల్లు వదిలి వెళ్లిపోతాయి.

