India
oi-Lingareddy Gajjala
కొలంబియాలోని మాగ్డలీనా నదీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న 80 హిప్పోలను చంపాలన్న ఆ దేశ ప్రభుత్వ నిర్ణయంపై వంతారా వ్యవస్థాపకుడు అనంత్ ముఖేష్ అంబానీ భావోద్వేగంతో స్పందించారు. ఆ జీవాలను చంపవద్దని, వాటికి బదులుగా భారతదేశంలోని జామ్‌నగర్‌లో ఉన్న ‘వంతారా’ సంరక్షణ కేంద్రానికి తరలించాలని ఆయన కొలంబియా పర్యావరణ మంత్రి ఐరీన్ వెలెజ్ టోరస్‌కు అధికారికంగా లేఖ రాశారు. ఆ 80 జీవాలకు జీవితాంతం ఆశ్రయం కల్పించి, కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన తన ప్రతిపాదనలో హామీ ఇచ్చారు.
ఈ ప్రతిపాదన చేస్తూ అనంత్ అంబానీ రాసిన లేఖలో ప్రతి అక్షరం ఆయనకు జంతువుల పట్ల ఉన్న ప్రేమను చాటిచెబుతోంది. “ఆ 80 హిప్పోలు ఎక్కడ పుట్టాలో అవి ఎంచుకోలేదు. అవి ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను అవి సృష్టించుకోలేదు. అవి కేవలం శ్వాస తీసుకునే బొమ్మలు కావు.. ప్రకృతిలో జీవించే జీవాలు. వాటిని కాపాడే శక్తి మనకు ఉన్నప్పుడు, ఒక ప్రయత్నం కూడా చేయకుండా వదిలేయడం మానవత్వం అనిపించుకోదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, ఆ 80 హిప్పోలను కొలంబియా నుంచి గుజరాత్‌కు తరలించడానికి అయ్యే పూర్తి ఖర్చును, కార్యాచరణ బాధ్యతను తామే భరిస్తామని అనంత్ ప్రకటించారు.

ఖర్చు మాదే.. సంరక్షణ మాదే!
ఈ ప్రాజెక్టు కోసం ‘వంతారా’ అత్యున్నత స్థాయి ప్రణాళికను సిద్ధం చేసింది. అత్యాధునిక వెటర్నరీ నిపుణుల పర్యవేక్షణలో, ప్రత్యేక విమానాల ద్వారా అత్యంత భద్రంగా ఈ హిప్పోలను జామ్‌నగర్‌కు తీసుకురానున్నారు. ఇందుకోసం అక్కడ వాటికి కావాల్సిన సహజ సిద్ధమైన ఆవాసాన్ని, నీటి వసతిని ఇప్పటికే సిద్ధం చేశారు. కొలంబియా అధికారుల పర్యవేక్షణలోనే ఈ ప్రక్రియ అంతా సాగాలని, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే ఈ తరలింపు ఉంటుందని అనంత్ స్పష్టం చేశారు.
పబ్లో ఎస్కోబార్ హయాం నుంచి నేటి మృత్యువు వరకు..
11980వ దశకంలో పబ్లో ఎస్కోబార్ హయాంలో ప్రవేశపెట్టిన కొన్ని హిప్పోలు, ఇప్పుడు 200కు పైగా వృద్ధి చెందాయి. అక్కడ వీటికి సహజ శత్రువులు లేకపోవడంతో జనాభా వేగంగా పెరిగి, స్థానిక పర్యావరణానికి ముప్పుగా మారాయి. దీంతో అధికారులు వీటిని ‘హానికరమైన జాతి’గా వర్గీకరించి, జనాభా నియంత్రణలో భాగంగా 80 హిప్పోలను చంపాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా చర్చకు దారితీసిన సమయంలో అనంత్ అంబానీ చేసిన ప్రతిపాదన ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది.
గ్లోబల్ హ్యూమన్ అవార్డు గ్రహీత అడుగులు,,
జంతు సంక్షేమం పట్ల ఉన్న నిబద్ధతకు గాను అనంత్ అంబానీ ఇటీవల ‘గ్లోబల్ హ్యూమన్ అవార్డు’ను అందుకున్నారు. ఈ పురస్కారాన్ని అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల్లో ఒకటిగా పేరుగాంచిన వంతారా, ఇప్పటికే వేల సంఖ్యలో ఏనుగులు, పెద్ద పిల్లులు మరియు ఇతర జంతువులకు పునరావాసం కల్పిస్తోంది. ఇప్పుడు కొలంబియా హిప్పోల విషయంలో ఆయన తీసుకున్న చొరవ భారతదేశం యొక్క వన్యప్రాణుల సంరక్షణ స్థాయిని అంతర్జాతీయ వేదికపై మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.

