నారాయణపేట జిల్లా కోస్గి పట్టణానికి చెందిన వార్ల మల్లేశం అనే ఉపాధ్యాయుడి టెర్రస్ గార్డెన్‌లో ఓ అరుదైన దృశ్యం దర్శనమిచ్చింది. సంవత్సరంలో కేవలం మే మాసంలో ఒక్కసారి మాత్రమే పూసే స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ పుట్బాల్ లిల్లీ అనే పుష్పం వికసించింది. ఈ మొక్క వృక్షరాజ్యంలోని అమరిల్లిడేసి కుటుంబానికి చెందిది. ఈ దుంపకాండ మొక్క శాస్త్రీయ నామం స్కాడోక్సస్ మల్టీఫ్లోరస్ కాగా.. భారత దేశంలో ఈ మొక్కను పుట్బాల్ లిల్లీ, బ్లడ్ లిల్లీ అనే పేర్లతో పిలుస్తుంటారు. బ్రిటిష్ కాలం నాటి నుండి ఈ మొక్క ఉనికి మన దేశంలో కొనసాగుతుంది.
ఇక ఆంధ్రప్రదేశ్ లోని పాడేరు నుండి ఆసక్తితో పదేళ్ల క్రితం ఈ మొక్క దుంపను తెచ్చికున్న మల్లేశం దాన్ని జాగ్రత్తగా కుండీలో నాటి పెంచుతున్నారు. ప్రతి ఏటా మే నెలలో మాత్రమే ఈ మొక్కకు పుష్పాలు పూస్తాయని తెలిపారు. అయితే ప్రతి ఏటా ఈ మొక్కకు ఓకే పుష్పం పూసేదని.. కానీ గత ఏడాది మాత్రం నాలుగు పుష్పాలు పూయగా.. ఇప్పుడు ఒకటి పెరిగి ఐదు పూశామని సంతోషం వ్యక్తం చేశారు.
జూన్ నెల వరకు ఈ పుష్పాలు ఉంటాయని.. ఆ తరువాత అవి రాలి పోతాయని ఆయన చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చిన ఆకులు జనవరి వరకు మాత్రమే ఉండి ఎండిపోతాయంటున్నారు. కేవలం దుంప మాత్రమే మట్టిలో దాగి ఉండి మే నెలలో మొగ్గలు తోడిగి పువ్వులు వస్తాయని, అందుకే దీనిని మే పుష్పం అని పిలుస్తారని మల్లేశం చెప్పారు. ఈ దుంపను ఒక్కసారి నేలలో పాతితే ఈ మొక్కకు మరణమే ఉండదని ఆయన చెబుతున్నారు.
ఇక మల్లేశం ఇంట్లో ఫుట్ బాల్ లిల్లీ వికసించిన సమాచారం తెలుసుకొని కోస్గి పట్టణ వాసులు మే పుష్పాన్ని చూసేందుకు క్యూ కట్టారు. అరుదైన పుష్పాన్ని చూసి అందరూ ముచ్చటపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

