India
oi-Bomma Shivakumar
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తుతోంది. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని నిలిపివేయడంతో భారత్ కు ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో ఈ సంక్షోభం నుంచి బయట పడేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున ఎల్ఎన్జీ స్టోరేజీ ట్యాంకులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పెట్రో నెట్ ఎల్ఎన్జీ ద్వారా మొత్తం 7 కొత్త ట్యాంకులను నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ఇవి ఒడిషాలోని గోపాల్ పూర్, కేరళలోని కొచ్చి, గుజరాత్ లోని దహేజ్ ప్రాంతాల్లో నిర్మితం కానున్నాయి. ఈ ప్రాజెక్టులు రాబోయో 3 ఏళ్లలో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఖతార్, యూఏఈ నుంచి వచ్చే గ్యాస్ సరఫరా ప్రస్తుతం యుద్ధం కారణంగా నిలిచిపోయింది. ముఖ్యంగా ఖతార్ లోని రాస్ లఫాన్ ప్లాంట్ నుంచి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎలాంటి షిప్ మెంట్స్ అందలేదు. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కారణంగా సముద్ర మార్గాల్లోనూ రవాణా కష్టతరం అవుతోంది.

మరోవైపు భారత్ తన గ్యాస్ అవసరాల్లో 50 శాతం దిగుమతి చేసుకుంటోంది. అందులో దాదాపు 40 శాతం ఈ దేశాల నుంచే సరఫరా అవుతోంది. ఇక ప్రస్తుతానికి భారత్ వద్ద ఆపరేషనల్ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా కొరత ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ధరల పెరుగుదల, సిలిండర్ల లభ్యతపై ప్రభావం చూపనుంది. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

