అమరావతి, మే 6: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న 51 మంది వైద్యులను విధుల నుంచి తొలగించినట్లు మంత్రి తెలిపారు. వీరిలో 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 41 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఏపీ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ ప్రకారం ఏడాదికిపైగా విధులకు గైర్హాజరవుతున్న వారిని ఉద్యోగానికి రాజీనామా చేసినట్లుగా పరిగణించి చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అయితే నేరుగా చర్యలు తీసుకోకుండా ముందుగా సంజాయిషీ నోటీసులు ఇచ్చి సమయం కూడా ఇచ్చామని వివరించారు. అయినప్పటికీ స్పందించకపోవడంతో చివరకు తొలగింపు చర్యలు తీసుకున్నామన్నారు.
ఆరేళ్లు, ఏడేళ్లుగా విధులకు దూరం
విధుల నుంచి తొలగించిన వారిలో కొందరు చాలా కాలంగా ఆస్పత్రులకు రాకపోవడం బయటపడింది. ఆంధ్ర వైద్య కళాశాలకు చెందిన ఓ అసోసియేట్ ప్రొఫెసర్ 2020 ఫిబ్రవరి నుంచి విధులకు హాజరుకావడం లేదని అధికారులు గుర్తించారు. మరికొందరు 2022 నుంచి కూడా విధులకు దూరంగా ఉన్నట్లు తేలింది. ట్యూటర్లలో ఒకరు ఏకంగా ఏడేళ్లుగా విధులకు రాకపోవడం సంచలనంగా మారింది. కడప, అనంతపురం, ఒంగోలు, తిరుపతి, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, నెల్లూరు, మార్కాపురం ప్రభుత్వ వైద్య కళాశాలలకు చెందిన వైద్యులు ఈ జాబితాలో ఎక్కువగా ఉన్నారు.
సొంత వ్యాపకాలతో డ్యూటీలకు గైర్హాజరు
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. కొందరు వైద్యులు సొంత వ్యాపకాలు, ప్రైవేట్ ప్రాక్టీసులు చూసుకుంటూ ప్రభుత్వ విధులకు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రెగ్యులర్ నియామకాల ద్వారా ప్రభుత్వ సేవల్లో చేరినప్పటికీ.. కొందరు ఆస్పత్రులకు రాకుండా వేతనాలు పొందుతున్నారన్న ఫిర్యాదులు చాలా కాలంగా వస్తున్నాయి. దీనివల్ల బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు దెబ్బతింటున్నాయని ప్రభుత్వం భావించింది. ప్రత్యేకంగా మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత కారణంగా విద్యార్థులు, రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నివేదికలు రావడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.
ఇవి కూడా చదవండి
వైద్యులు విధులకు హాజరుకాకపోవడంపై మంత్రి సీరియస్ కావడంతో డీఎంఈ అధికారులు పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల నుంచి హాజరు వివరాలు తెప్పించారు. ఎవరు ఎంతకాలంగా విధులకు దూరంగా ఉన్నారు? ఎవరికి నోటీసులు ఇచ్చారు? ఎవరెవరు స్పందించారు? అనే అంశాలపై ప్రత్యేక జాబితా సిద్ధం చేశారు. తర్వాత నిబంధనల ప్రకారం తొలగింపు ప్రక్రియ చేపట్టారు.
మరో ముగ్గురు ప్రొఫెసర్లపై కూడా చర్యలు ప్రస్తుతం తొలగించిన 51 మందిలో ప్రొఫెసర్లు లేరు. అయితే దీర్ఘకాలంగా విధులకు దూరంగా ఉన్న ముగ్గురు ప్రొఫెసర్లపై కూడా త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం ఐదుగురు ప్రొఫెసర్లు దీర్ఘకాలంగా గైర్హాజరైనట్లు గుర్తించగా.. నోటీసుల తర్వాత ఇద్దరు తిరిగి విధుల్లో చేరినట్లు సమాచారం. మిగిలిన ముగ్గురిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది.
33 మందికి ఛార్జిమెమోలు
ఇంకా ఏడాది పూర్తి కాకపోయినా దీర్ఘకాలంగా విధులకు రాని మరో 33 మంది వైద్యులకు ఛార్జిమెమోలు జారీ చేశారు. వీరిలో ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఇప్పటికే 11 మంది వైద్యులు నోటీసుల తర్వాత తిరిగి విధుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారు కూడా వెంటనే హాజరుకాకపోతే.. ఏడాది గడువు దాటిన తర్వాత వారిపైనా ఉద్వాసన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు. “బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించం” విధుల నిర్వహణలో అలక్ష్యం, నిర్లక్ష్యం సహించబోమని మంత్రి సత్యకుమార్ యాదవ్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉంటారని.. ఇష్టానుసారంగా విధులకు దూరంగా ఉండటం తీవ్రమైన విషయం అని పేర్కొన్నారు. “ప్రభుత్వ సేవలో ఉంటూ విధులకు హాజరుకాకపోవడం అనేది చిన్న విషయం కాదు. రోగులకు నష్టం జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? బాధ్యతారాహిత్యాన్ని ప్రభుత్వం ఉపేక్షించే పరిస్థితి లేదు” అని మంత్రి స్పష్టం చేశారు.
జీరో వేకెన్సీ పాలసీ వైపు ప్రభుత్వం
ఒకవైపు గైర్హాజరు వైద్యులపై చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు ఖాళీల భర్తీపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. జీరో వేకెన్సీ పాలసీ కింద వెంటనే నియామకాలు చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటోంది. బోధనాసుపత్రుల్లో వైద్యులు, అధ్యాపకుల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పలు పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ తాజా చర్యలతో బోధనాసుపత్రుల్లో డ్యూటీలకు గైర్హాజరు అయ్యే వైద్యుల్లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఇకపై విధులకు డుమ్మా కొడితే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాన్ని ప్రభుత్వం స్పష్టంగా ఇచ్చిందని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

