India
oi-Jakki Mahesh
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా పర్యటిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు విజయ్ వినూత్న ప్రచార శైలిని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా రోడ్లపై విజయ్ సైకిల్ తొక్కుతూ ప్రజలను పలకరిస్తున్నారు. అయితే తాజాగా కన్యాకుమారి ర్యాలీలో విజయ్ సైకిల్ తొక్కుకుంటూ వెళ్తుండగా ఓ అనూహ్య ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
భయాందోళనకు గురైన విజయ్
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. విజయ్ తన ప్రచార వాహనం ముందు ఉత్సాహంగా సైకిల్ తొక్కుతున్నారు. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని విజయ్ సైకిల్ వెళ్తున్న దారిలో ఒక్కసారిగా పూలు చల్లాడు. ఆ హఠాత్పరిణామానికి విజయ్ ఒక్కసారిగా కంగారుపడ్డారు. ఏదైనా దాడి జరుగుతుందేమో అన్న అనుమానంతో వెంటనే సైకిల్ ఆపేశారు. విజయ్ భయాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయన దగ్గరకు పరుగున వచ్చి.. విజయ్‌ను ఆయన సైకిల్‌ను అక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్లిపోయారు.

సోషల్ మీడియాలో నెటిజన్ల ట్రోలింగ్
ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు విజయ్ భయాన్ని చూసి ఎగతాళి చేస్తున్నారు. “రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తికి ఇంత భయం ఉంటే ఎలా? పూలు చల్లితేనే బాంబు దాడి అనుకుని భయపడితే ప్రజలను ఎలా కాపాడతారు?” అంటూ విమర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది డీప్‌ఫేక్ లేదా ఏఐ ద్వారా సృష్టించిన వీడియో అని కొట్టిపారేస్తున్నారు. సెక్యూరిటీ పరంగా అప్రమత్తంగా ఉండటం తప్పేమీ కాదని విజయ్ ఫ్యాన్స్ ఆయనను వెనకేసుకొస్తున్నారు.
Vaadu Visaradam Kuda Alane Visiradu Gara😅😅 pic.twitter.com/ZK1MKSPUiH
— MB Ramesh Nayak🦁 (@Mbramesh_4005) April 14, 2026
రెండు స్థానాల నుంచి విజయ్ పోటీ
మరోవైపు విజయ్ ఈ ఎన్నికల్లో అత్యంత పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతున్నారు. ఆయన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. యువతను ఆకట్టుకునేందుకు విద్యా సహాయం కింద రూ.20 లక్షలు, నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 4 వేలు ఇస్తామంటూ భారీ హామీలను ప్రకటించారు. అలాగే 75 శాతం ఉద్యోగాలను తమిళులకే కేటాయిస్తామని హామీ ఇవ్వడం ద్వారా స్థానిక సెంటిమెంట్‌ను బలంగా వాడుకుంటున్నారు.

