India
oi-Jakki Mahesh
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీస్తూ.. ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయ అధికారం పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటే, తమిళనాడు మొత్తం స్తంభించిపోయేలా భారీ నిరసనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో, పునర్విభజన వల్ల దక్షిణాదికి జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి ప్రతి కుటుంబం రోడ్లపైకి వస్తుందని, తన నాయకత్వంలోనే ఈ పోరాటం జరుగుతుందని స్టాలిన్ స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో రహస్య వ్యూహమా?:
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఏప్రిల్ 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించడాన్ని స్టాలిన్ తప్పుబట్టారు. ఎన్నికల హడావుడిలో ఉన్నప్పుడు నియోజకవర్గాల పునర్విభజన కోసం సవరణలను బలవంతంగా ఆమోదించుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియను రహస్యంగా నిర్వహించడం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయని.. కేంద్రం ఇప్పటివరకు దీనిపై ఎలాంటి స్పష్టమైన వివరణ ఇవ్వలేదని ఆయన విమర్శించారు.

డీఎంకే పూర్వ వైభవం చూస్తారు:
తాను కేవలం ముఖ్యమంత్రిని మాత్రమే కాదని, ఓ శక్తివంతమైన రాజకీయ ఉద్యమమైన డీఎంకే నేతను అని స్టాలిన్ గుర్తు చేశారు. 1950, 60వ దశకాల్లో డీఎంకే సాగించిన చారిత్రాత్మక పోరాటాలను దేశం మరోసారి చూస్తుందని ఆయన హెచ్చరించారు. పదవులు, ఎన్నికల కంటే తమకు ఆత్మగౌరవం, సిద్ధాంతాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. అన్నాదురై, కరుణానిధిల నుంచి వారసత్వంగా వచ్చిన సిద్ధాంతాల ప్రకారం రాష్ట్రాల హక్కుల కోసం చివరి వరకు పోరాడుతామని ఆయన ఉద్ఘాటించారు.
Hon’ble Prime Minister, this is Tamil Nadu’s final warning.
மாண்புமிகு பிரதமர் அவர்களே, இது தமிழ்நாட்டின் இறுதி எச்சரிக்கை!#TNwillFightTNwillWin pic.twitter.com/v9wkYYM6MO
— M.K.Stalin – தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 14, 2026
కుటుంబ నియంత్రణ పాటిస్తే శిక్షిస్తారా?:
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహా మేరకు దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను, జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశాయని.. దానికి ప్రతిఫలంగా ఇప్పుడు రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించి మమ్మల్ని శిక్షిస్తారా? అని స్టాలిన్ ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ నుంచి స్పష్టమైన హామీ కోరినా సమాధానం రాలేదని, ఎంపీలకు ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తమిళనాడు నుండి కేంద్రానికి ఇస్తున్న చివరి హెచ్చరిక అని, రాష్ట్ర హక్కుల కోసం దేశం దృష్టిని ఆకర్షిస్తామని ఆయన ముగించారు.

