ప్రియమైన నాన్నా… నువ్వంటే నాకు ప్రాణం.. నువ్వుంటేనే మా బంగారు భవిష్యత్. నాన్న నువ్వెప్పుడు చల్లగా ఉండాలి.. బైక్ పై బయటకు వెళితే మాత్రం జాగ్రత్తా.. హెల్మెట్ తప్పక ధరించు – క్షేమంగా ఇంటికి రా. మరిచిపోకు నీకోసం ఇక్కడ ఓ ప్రాణం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది మంచిర్యాల జిల్లా కోటపల్లి కేజీబీవీ (KGBV) పాఠశాల విద్యార్థులు తమ నాన్నకు రాసిన లేఖల సారాంశం. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పోలీసుల సహాకారంతో నిర్వహించిన ‘పోస్ట్ కార్డ్’ లేఖల కార్యక్రమంలో ఇలా తమ భావోద్వేగాన్ని లేఖల ద్వారా పంచుకున్నారు విద్యార్థులు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ఏప్రిల్ 13 నుండి 18 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రోడ్డు భద్రత.. ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్ – అలైవ్’ (Arrive – Alive) కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేజీబీవీ (KGBV) పాఠశాలలో విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు లేఖలు రాయించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు పోలీసులు.
కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఎంతో భావోద్వేగంతో తమ తండ్రులకు పోస్ట్ కార్డ్ లేఖలు రాశారు.
ప్రియమైన నాన్నకు.. రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.. మా కోసం మీరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. నాన్న.. నాకు, అమ్మకు కూడా హెల్మెట్లు తీసుకురండి. అంటూ విద్యార్థులు తమ లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ, పిల్లల మాట అంటే తల్లిదండ్రులకు అమితమైన ఇష్టమని, వారి అభ్యర్థన మేరకు ప్రతి తండ్రి బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం వద్దని హితవు పలికారు. రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, నియమాలు పాటించడం ద్వారా అమూల్యమైన ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

