వైఎస్ఆర్ కడప జిల్లా గండి వీరాంజనేయస్వామి ఆలయంలోని అర్చకుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు హారతి పళ్లెంలో సమర్పించే డబ్బులను.. హుండీలో వేయడానికి ప్రధాన అర్చకుడు అంగీకరించనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆదేశాలను సైతం లెక్కచేయడం లేదు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ భక్తుడు గండి ఆంజనేయస్వామి గుడిని సందర్శించారు. రూ.500 పెట్టి ఆకుపూజ టికెట్ కొనుగోలు చేశారు. అయితే టికెట్ కొనుగోలు చేసినప్పటికీ అర్చన సమయంలో అదనంగా రూ.200 ఇవ్వాలని అర్చకులు డిమాండ్ చేశారని.. అదనంగా ఇస్తేనే పూజ చేస్తామని చెప్పినట్లు భక్తుడు వాపోయాడు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటంతో గండి ఆలయంలో అర్చకుల తీరు వెలుగులోకి వచ్చింది.
హైలైట్:
- గండి ఆలయంలో వివాదం
- ప్రధాన అర్చకుడి తీరుపై విమర్శలు
- అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని భక్తుల ఆరోపణ

తెలంగాణకు చెందిన భార్గవ్ అనే భక్తుడు శనివారం రోజున గండి వీరాంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించారు. రూ.516లు పెట్టి ఆకుపూజ టికెట్ కొనుగోలు చేశారు. అయితే టికెట్ ఉన్నప్పటికీ అదనంగా 200 రూపాయలు ఇస్తేనే పూజ చేస్తామని అర్చకులు డిమాండ్ చేసినట్లు భక్తుడు వాపోయారు. తాను ఇప్పటికే 516 రూపాయలు పెట్టి టికెట్ కొనుగోలు చేశానని.. మళ్లీ 200 ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఈ విషయంపై దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్‌కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఆలయ ఇన్‌స్పెక్టర్ రవిచంద్రారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ జయచంద్రారెడ్డిలను డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ వివరణ కోరారు.
మరోవైపు హారతి పళ్లెంలో వేసే కానుకలు హుండీలో వేయాలని గతంలోనే ఆదేశించామన్న డిప్యూటీ కమిషనర్.. శనివారం భక్తులు సమర్పించిన కానుకలను హుండీలో వేసేది లేదనీ అర్చకులు అన్నట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి హారతి పళ్లెంలో డబ్బులు హుండీలో వేయద్దని చెప్పడంతోనే హుండీలో వేయలేదని అర్చకులు చెప్పినట్లు తెలిసిందన్నారు. ఆలయ ఉద్యోగులు ఇచ్చిన వివరణను పరిశీలించి బాధ్యులైన అర్చకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


