కృత్రిమ గర్భధారణతో జన్మించిన పుంగనూరు జాతి లేగదూడ అందరినీ.. అబ్బురపరుస్తోంది. ఈ అరుదైన ఘటన తెలంగాణలోని పాలమూరు జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణ – కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడేబల్లూరులో అరుదైన పుంగనూరు జాతి లేగదూడ జన్మించింది. మారుతీనగర్ కి చెందిన రైతు రుద్రరాజు లక్ష్మీపతిరాజు పశువుల కొట్టంలో రెండురోజుల క్రితం పుంగనూరు లేగ దూడ పుట్టింది. స్వతహాగా పాడి పశువులు పెంపకందారుడైన లక్ష్మీపతిరాజు గతేడాది దేశీ ఆవుకు పుంగనూరు జాతికి చెందిన ఆవు వీర్యంతో కృత్రిమ గర్భధారణతో పుట్టిన ఆవును సుమారు లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేశాడు. దానికి కృత్రిమ గర్భధారణ చేయగా అత్యంత చిన్నగా ఉన్న లేగదూడ జన్మించింది.
మూడు తరాల తర్వాత పుంగనూరు జాతి చిట్టి ఆవు:
ప్రస్తుతం జన్మించిన పుంగనూరు లేగదూడ మూడో తరానికి చెందినది. మొదట ఓ దేశీ ఆవుకు పుంగనూరు జాత ఆవు వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేయించారు. ఆ ఆవుకు పుట్టిన ఆవుకు చిత్తూరు జిల్లా గుమ్మలేరు నుంచి వీర్యాన్ని తెప్పించి కృత్రిమ గర్భధారణ చేయడంతో రెండోతరం జన్మించింది. దానికి హైదరాబాద్ నుంచి ఆడ పుంగనూరు జాతి వీర్యం తెచ్చి కృత్రిమ గర్భధారణ చేశారు. దీంతో మూడు తరాల తర్వాత అత్యంత చిన్నగా ఉన్న పుంగనూరు లేగదూడ గుడేబల్లూరులో జన్మించింది.
వీడియో చూడండి..
ప్రధాని మనసు చూరగొన్న ఆవు:
చిత్తూరు జిల్లా కొండకోనల్లో పుట్టిన ఈ పుంగనూరు జాతి చిట్టి ఆవులు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్శించాయి. అంతేకాదు ఆయన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా వీటిని పెంచుతున్నారు. అతి తక్కువ పశుగ్రాసంతో ఔషధ గుణాలు కలిగిన పాలు అందజేసే ఆవులుగా వీటికి ప్రసిద్ధి.
ఇక ప్రస్తుతం పుంగనూరు జాతికి చెందిన రెండు ఆవులు లక్ష్మీపతిరాజు పశువుల కొట్టంలో ఉన్నాయి. ఇవి రెండు నుంచి మూడు లీటర్ల పాలు ఇస్తున్నాయి. ఇదే గ్రామానికి చెందిన రామచంద్రమూర్తి మరో ఐదు ఆవులను పెంచుతున్నారు. ఇక జిల్లాలో ఇలాంటి లేగదూడ జననం ఇదే మొదటి సారి. పుంగనూరు లేగదూడ జననం సమాచారం తెలుసుకొని పరిసర గ్రామాల పాడిరైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి చిట్టి లేగదూడను వీక్షిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

